ఈనెల 23 నుండి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ క్రీడలకు కరోనా భయం పట్టుకుంది. టోక్యో ఒలింపిక్ విలేజ్‌లో కరోనా కలకలం రేగింది. అథ్లెట్లుండే ‘ఒలింపిక్స్ గ్రామం’లో తొలి కరోనా కేసు నమోదైనట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ విషయాన్ని టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ వెల్లడించింది.
‘‘ఒలింపిక్స్ గ్రామంలో ఓ అథ్లెట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే తొలి కేసు. ప్రొటోకాల్ లో భాగంగా టెస్టులు చేయగా.. ఆ అథ్లెట్ కు కరోనా సోకినట్టు తేలింది’’ అని ఆర్గనైజింగ్ కమిటీ అధికార ప్రతినిధి మాసా తకాయా వెల్లడించారు. ప్రస్తుతం ఆ అథ్లెట్ ను ఐసోలేషన్ లో ఉంచినట్టు చెప్పారు. అతడిని కాంటాక్ట్ అయిన వారిని క్వారంటైన్ లో పెట్టామన్నారు. అయితే, ఆ అథ్లెట్ ఎవరు? ఏ దేశానికి చెందిన వారు? అన్న విషయాలను మాత్రం గోప్యంగా ఉంచారు.
గత ఏడాదే టోక్యోలో ఒలింపిక్స్ జరగాల్సి ఉన్నా.. కరోనా మహమ్మారి విజృంభణతో దానిని ఈ ఏడాదికి వాయిదా వేశారు. ఒకానొక సందర్భంలో ఒలింపిక్స్ ను రద్దు చేయాలన్న డిమాండ్ కూడా వినిపించింది. అయితే, కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టడం, ప్రపంచంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం, బయో బబుల్ వంటి కఠినమైన ఆంక్షలు విధించడం వంటి వాటితో ఒలింపిక్స్ నిర్వహణకే కమిటీ మొగ్గు చూపింది. జులై 23 నుంచి ఒలింపిక్స్ మొదలవుతాయని ప్రకటించింది.
[zombify_post]