ఏపీలో కొత్త కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం రోజున ఏపీలో 758 మందికి కరోనా సోకగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో ఒకే కుటుంబంలోని 21 మందికి పాజిటివ్ రావడం కలకలం రేపింది.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆ కుటుంబంలోని ఓ విద్యార్థి, రాజమహేంద్రవరంలోని ఓ కాలేజీలో చదువుకుంటున్నాడు. ఇటీవల అతను ఇంటికి వచ్చాడు. ఆపై ఇంట్లోని వారంతా అనారోగ్యం బారిన పడ్డారు. ప్రతి ఒక్కరికీ జ్వరం, జలుబు వంటి సమస్యలు రాగా, నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిన అధికారులు, మొత్తం అందరికీ కరోనా సోకినట్టుగా నిర్ధారించారు.
దీంతో వారందరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన అధికారులు, గడచిన మూడు నాలుగు రోజులుగా వారు ఎవరెవరిని కలిశారన్న విషయమై ఆరా తీస్తున్నారు.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 40,604 కరోనా పరీక్షలు నిర్వహించగా 984 మందికి పాజిటివ్ అని తేలింది. ఏపీలో ఇప్పటివరకు 8,96,863 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,85,515 మంది కరోనా మహమ్మారి కోరల నుంచి విముక్తులయ్యారు. ఇంకా 4,145 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వల్ల మృతి చెందినవారి సంఖ్య 7,203కి పెరిగింది.
[zombify_post]